AP Budget: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో శుక్రవారం (ఫిబ్రవరి 28న) ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.3,22,359 కోట్లతో మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత సమయం ప్రకారం.. 10.08 గంటలకు మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
AP Budget: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో కొన్నింటికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టయింది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్, మ్యానిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు అధిక కేటాయింపులు జరిగాయి. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు కాగా, రెవెన్యూ లోటు 33,185 కోట్లుగా ఉన్నది. ద్రవ్యలోటు 79,926 కోట్లుగా ఉన్నది. మూలధన వ్యయం 40,635 కోట్లుగా ఉన్నది.
AP Budget: బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రతీ శాఖలోనూ ఆర్థిక అరాచకం చేసిందని ఆరోపించారు. ఆయా శాఖల్లో లెక్కలను ఒక కొలిక్కి తెచ్చేందుకు చాలా సమయమే పట్టిందని తెలిపారు. గత ప్రభుత్వ అరాచకాలను స్వయంగా నీతి ఆయోగ్ నివేదికలో తేటతెల్లమైందని చెప్పారు. ఏపీ రుణ సామర్థ్యాన్ని సున్నాకు తెచ్చారని, రాష్ట్రానికి అప్పు తీసుకునే పరిస్థితి లేదని నీతి ఆయోగ్ తెలిపిందని వివరించారు. ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టతరమైందని చెప్పారు.
AP Budget: దేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తిలేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలే తనకు మార్గదర్శకంగా నిలిచాయని చెప్పారు. అణు దాడిలో ధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది, ఆర్థిక విధ్వంసం జరిగిన ఏపీని తిరిగి నిలబెట్టలేమా అన్న ఆయన మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్‌ను రూపొందిందని వివరించారు.
శాఖలు – బడ్జెట్ కేటాయింపులు (కోట్ల రూపాయల్లో)
వ్యవసాయ అనుబంధ రంగాలు – 13,487
పౌరసరఫరాల శాఖ – 3,806
గృహనిర్మాణ శాఖ – 6,318
గృహ మంత్రిత్వ శాఖ – 8,570
ఎస్సీల సంక్షేమం – 20,281
పాఠశాల విద్యాశాఖ – 31,805
ఉన్నత విద్యాశాఖ – 2,506
ఎస్టీల సంక్షేమం – 8,159
బీసీల సంక్షేమం – 47,456
అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం – 5,434
మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం 4,332
నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ – 1,228
వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం – 19,264
పంచాయతీరాజ్ శాఖ – 18,847
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ – 13,862
జలవనరుల శాఖ – 18,019
పరిశ్రమలు, వాణిజ్యశాఖ – 3,156
ఇంధన శాఖ – 13,600
ఆర్ అండ్ బీ శాఖ – 8,785
యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – 469 కోట్లు
తెలుగు భాషాభివృద్ధి, ప్రచారం – 10
మద్యం, మాదకద్రవ్యాల రహితరాష్ట్రం కోసం – 10
అన్నదాత సుఖీభవ కోసం – 6,300
పోలవరం కోసం – 6,705
జల్‌జీవన్ మిషన్ – 2,800
తల్లికి వందనం -9,407
రెవెన్యూ అంచనా – 2,51,162
మూలధన వ్యయ అంచనా – 40,635
రెవెన్యూ లోటు – 33,185
ద్రవ్యలోటు – 79,926