AP Budget 2026-27

AP Budget 2026-27: రూ.3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. విద్యా రంగానికి పెద్దపీట

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత, ఈ బడ్జెట్‌ను మంత్రి సభ ముందుంచారు. కేవలం అంకెల పద్దులు మాత్రమే కాకుండా, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించడమే తమ ప్రభుత్వ సంకల్పమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

బడ్జెట్ ప్రధాన అంకెలు (రూపాయల్లో):

మొత్తం బడ్జెట్ వ్యయం రూ.3.32 లక్షల కోట్లుగా నిర్ణయించారు. ఇందులో కీలక కేటాయింపులు ఇలా ఉన్నాయి:

  • మొత్తం బడ్జెట్: రూ.3,32,000 కోట్లు
  • రెవెన్యూ వ్యయం: రూ.2,56,143 కోట్లు
  • మూలధన వ్యయం: రూ.53,915 కోట్లు
  • ద్రవ్య లోటు: రూ.75,868 కోట్లు

కీలక రంగాలు – కేటాయింపులు: 

ఈ బడ్జెట్‌లో విద్య, సాగునీరు – సంక్షేమానికి పెద్దపీట వేశారు.

  • విద్య: పాఠశాల విద్యాశాఖకు రూ.32,308 కోట్లు కేటాయించారు. ‘మన బడి మన భవిష్యత్తు’ పథకానికి రూ.1,500 కోట్లు కేటాయించారు.
  • వ్యవసాయం: అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,660 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు కేటాయించారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు.
  • అమరావతి & విశాఖ: రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.6,000 కోట్లు కేటాయించగా, విశాఖపట్నం ఆర్థిక ప్రాంతం (Economic Region) కోసం రూ.28,000 కోట్లు కేటాయించారు. విశాఖ రీజియన్ పరిధిలోకి 10 జిల్లాలు రానున్నాయి.
  • రాయలసీమ: రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ.30,000 కోట్లు ప్రకటించారు.
  • జలవనరులు: పోలవరం ప్రాజెక్టుకు రూ.6,105 కోట్లు సహా మొత్తం జలవనరుల శాఖకు రూ.18,224 కోట్లు కేటాయించారు.

సంక్షేమ పథకాలు:

బహుజన – వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం భారీ నిధులు కేటాయించారు:

  • బీసీ సంక్షేమం: రూ.51,021 కోట్లు
  • ఎస్సీ సంక్షేమం: రూ.20,644 కోట్లు
  • ఎన్టీఆర్ భరోసా: రూ.27,719 కోట్లు
  • దీపం 2.0: రూ.2,601 కోట్లు
  • మహిళా సంక్షేమం: రూ.4,582 కోట్లు

శాంతిభద్రతలు & ఇతర అంశాలు:

రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హోంశాఖకు రూ.9,165 కోట్లు కేటాయించారు. అలాగే, మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *