CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాంతిభద్రతలపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో పోలీసులు దుర్వినియోగానికి గురయ్యారని, రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి హింసించారని ఆయన ఆరోపించారు. తాను, స్పీకర్ అయ్యన్న పాత్రుడు సహా తమ ప్రభుత్వంలోని పలువురు నేతలు అప్పటి అరాచక పాలనకు బాధితులే అని చంద్రబాబు అన్నారు.
అక్రమ కేసులతో రాజకీయ వేధింపులు :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో గత పాలనలో జరిగిన రాజకీయ వేధింపులను వివరించారు. తనపైనే 17 అక్రమ కేసులు పెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని మండిపడ్డారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న అయ్యన్న పాత్రుడుపైనా అత్యాచారయత్నం కేసు పెట్టారని ఆయన అన్నారు. అంతేకాకుండా, నారా లోకేష్ యువగళం పాదయాత్రపైనా కేసులు పెట్టారని, తనపై జరిగిన దాడికి కూడా తనపైనే కేసు పెట్టారని గుర్తు చేశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి అనేక మంది నేతలపై అక్రమ కేసులు పెట్టారని, ఎందుకు జైలుకు వెళ్తున్నారో కూడా తెలియని దుస్థితి అప్పట్లో ఉండేదని పేర్కొన్నారు.
వివేకా హత్య కేసుపై సీఎం ఫైర్ :
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపైనా సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ కేసులో తనకు లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్యపై తీవ్రంగా మండిపడ్డారు. వివేకా హత్యను మొదట గుండెపోటుగా చెప్పారని, అయితే ఆయన కుమార్తె సునీత కోరిక మేరకు పోస్టుమార్టం చేయించగా అది హత్య అని తేలిందని గుర్తు చేశారు. నేరస్తులకు అండగా ఉండే రాజకీయ నాయకులను తాను ఎప్పుడూ చూడలేదని, నేర ప్రవృత్తి ఉన్నవారే ఇప్పుడు రాజకీయాలకు వస్తున్నారని ఆరోపించారు. నేరస్థులతో కలిసి తనపైనే నోటీసులు పంపించే స్థాయికి పరిస్థితి దిగజారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Telangana: తెలంగాణలో కొత్త వైన్స్ షాప్‌లకు నోటిఫికేషన్ దరఖాస్తు స్వీకరణ.. రేపటి నుంచే
వైసీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు కూడా భయపడి రాష్ట్రం నుంచి వలస వెళ్లారని చంద్రబాబు తెలిపారు. గతంలో గుంటూరు ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తన పరిశ్రమను పక్క రాష్ట్రానికి తరలించుకుపోవడమే కాకుండా, రాజకీయాలకు కూడా దూరమయ్యారని ఆయన ఉదహరించారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, అలాంటి వారిని కూడా గత ప్రభుత్వం భయపెట్టిందని ఆయన విమర్శించారు. రైతుల పాదయాత్రలకు అడ్డంకులు సృష్టించారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.
శాంతిభద్రతల మెరుగుదల, రోడ్డు భద్రతపై దృష్టి :
ప్రస్తుత ప్రభుత్వం శాంతిభద్రతలను మెరుగుపరచడానికి కృషి చేస్తోందని సీఎం చెప్పారు. మహిళలపై నేరాలకు పాల్పడిన 343 మందికి ఈ సంవత్సర కాలంలో శిక్షలు పడ్డాయని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సాంకేతికతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.