Quantum Valley: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అమరావతిని సాంకేతికత ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ (Quantum Valley) ప్రాజెక్ట్‌కు సంబంధించిన భవన నమూనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సచివాలయంలో జరిగిన సమీక్షలో అధికారులు ఈ భవన డిజైన్లను ఖరారు చేశారు.
అమరావతిలోని లింగాయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరగనుంది. శుభవార్త ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచే ప్రాథమిక స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు.
Also Read: Minister Lokesh: బడిలో చదువుతో పాటు నైతిక విలువలు నేర్పాలి: మంత్రి లోకేశ్
క్వాంటమ్ వ్యాలీ నిర్మాణంలో డిజైన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతి పేరుకు సంకేతంగా ఉండేలా, ఈ ప్రాజెక్ట్‌లోని ప్రధాన భవనాన్ని ప్రత్యేకంగా ‘A’ ఆకారంలో (A Letter Design) డిజైన్ చేస్తున్నారు. ఈ ప్రధాన భవనం సుమారు 45 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనుంది.
ప్రధాన భవనంతో పాటు, దాని చుట్టూ మరో ఎనిమిది టవర్లను నిర్మించనున్నారు. ఈ ఎనిమిది టవర్లు కలిపి మొత్తం 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం కానున్నాయి. ఈ భవన సముదాయంలో పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, పెద్ద టెక్ కంపెనీలకు చోటు కల్పించనున్నారు.
క్వాంటమ్ వ్యాలీ పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెడితే, అమరావతిలో ఒక బలమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో వేలాది ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణం భవిష్యత్తులో టెక్నాలజీ రంగానికి కేంద్రంగా నిలవనుంది.
