Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి సమయాల్లో బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, రానున్న మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. అయితే కేవలం చలి మాత్రమే కాదు, కొన్ని చోట్ల వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం: ఎక్కడ వర్షం? ఎక్కడ పొడి వాతావరణం?
అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఏపీలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బుధవారం, గురువారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే శుక్రవారం నుంచి ఈ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా మారుతుంది. ఇక ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు ఎటువంటి వర్ష సూచన లేదు, అక్కడ వాతావరణం పొడిగానే ఉంటుంది. రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో కోల్డ్ వేవ్ అలర్ట్: గడ్డకట్టే చలి!
తెలంగాణలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండనుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉన్నప్పటికీ, చలి తీవ్రత మాత్రం విపరీతంగా పెరగనుంది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కోల్డ్ వేవ్ వీచే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 5°C వరకు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తగా ఉండాలని సూచన
వాతావరణంలో వస్తున్న ఈ హఠాత్తు మార్పుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చలిగాలుల ప్రభావంతో జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. అటు వర్షాలు పడే అవకాశం ఉన్న చోట రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి.
