India-Pakistan: జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ప్రభావంతో భారత్. ఈ దాడికి ప్రతిగా, న్యూఢిల్లీ ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా, పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చే అన్ని రకాల వస్తువుల దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రిత్వశాఖ పేర్కొంది. పాకిస్థాన్‌లో తయారుైన లేదా అక్కడి నుంచి భారతదేశానికి పంపబడే అన్ని వస్తువులపై ఈ నిషేధం అమలులోకి వచ్చింది. దీని వల్ల స్వేచ్ఛాయుత (ఫ్రీ) దిగుమతులే కాదు, ఇప్పటికే అనుమతులు పొందిన దిగుమతులూ ఇకపై భారత్‌కు ప్రవేశించలేవు. ఎవరైనా మినహాయింపులు కోరితే, భారత ప్రభుత్వానికి ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
భారత్, పాకిస్థాన్ మధ్య వాణిజ్యానికి ప్రధాన మార్గమైన అటారీ-వాఘా సరిహద్దును ఇప్పటికే మూసివేశారు. 2019 పుల్వామా దాడి తర్వాత నుంచే పాకిస్థాన్‌పై భారత ప్రభుత్వం దిగుమతులపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధిస్తోంది. అప్పట్లో పాక్ ఉత్పత్తులపై 200 శాతం దిగుమతి సుంకం విధించారు. ప్రస్తుతం గణాంకాల ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన దిగుమతుల విలువ కేవలం 0.42 మిలియన్ డాలర్లు మాత్రమే. ఇది మొత్తం విదేశీ వాణిజ్యంలో 0.1 శాతం కూడా కాకపోవడం గమనార్హం.
విలువ పరంగా ఈ దిగుమతులు తక్కువైనా, పాకిస్థాన్ పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, నూనె పదార్థాలు, మసాలా దినుసులు వంటి వాటిని భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇప్పుడు వాటిపై నిషేధం రావడంతో, ఆ రంగాల్లో పాక్‌లోని పరిశ్రమలు తీవ్ర ఆర్థిక నష్టానికి గురయ్యే అవకాశముంది.
Also Read: DELHI: పాక్ నుంచి భారత్ కు ఏం ఇంపోర్ట్ అయ్యేవో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
India-Pakistan: దిగుమతులపైనే కాదు, నౌకాశ్రయాల విషయంలోనూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ జెండాతో ఉన్న ఓడలు ఇకపై భారత పోర్టులలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అంతేగాక, భారత ఓడలు కూడా పాక్ పోర్టులకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇదే తరహాలో, పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలాన్ని కూడా ఇప్పటికే మూసివేసింది.
ఈ నిషేధానికి Foreign Trade Policy – 2023లో భాగంగా కొత్త నిబంధనల రూపంలో చట్టబద్ధత కూడా కల్పించారు. ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్ విధానాన్ని పాటిస్తున్న భారత్, పాకిస్థాన్‌ను ఆర్థికంగా ఒత్తిడికి గురి చేయాలని భావిస్తోంది. ఈ చర్యలు ద్వారా భారత్ తన ఆగ్రహాన్ని, నిరసనను గట్టి సంకేతంగా వెల్లడించింది.
ఈ చర్యలన్నింటితో పాక్‌కు వాణిజ్య పరంగా భారీ దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు, భవిష్యత్‌లో ఉగ్రదాడులపై పాక్ ప్రభుత్వ వ్యవహారం మారకపోతే, భారత్ మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.