Rain Alert: బంగాళాఖాతంలో వాతావరణం మారుతోంది. తూర్పు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది మంగళవారం నాటికి బలపడి ‘అల్పపీడనం’గా మారవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆ తరువాత 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ‘వాయుగుండం’గా మారే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు భారీ వర్షాలు:
ఈ వాయుగుండం ప్రభావంతో ఈ నెల అక్టోబర్ 22వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లాలకు వర్షాలు: నేడు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
మత్స్యకారులకు హెచ్చరిక: అక్టోబర్ 21 మధ్యాహ్నం నుండి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాతావరణం చాలా తీవ్రంగా మారుతుంది. అందుకే మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదు. ప్రస్తుతం సముద్రంలో ఉన్నవారు కూడా అక్టోబర్ 21వ తేదీ లోపు తీరానికి తిరిగి వచ్చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, వెంటనే మత్స్యశాఖ లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలి.
తెలంగాణలో వాతావరణం ఇలా ఉంది:
నేడు (ఆదివారం): భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.
రేపు (సోమవారం): పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు ఉండవచ్చు.
ఈ రోజు, రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి ఉరుములతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉంది.
అందరూ అప్రమత్తంగా ఉండండి! వాతావరణ మార్పులను గమనిస్తూ, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.