Phone Tapping Case: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం అయ్యింది. ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ పర్యవేక్షణలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను కొత్తగా ఏర్పాటు చేస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేసును వేగంగా పూర్తి చేసి, సాధ్యమైనంత త్వరగా చార్జిషీట్ దాఖలు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
కొత్తగా ఏర్పాటు చేసిన సిట్‌కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ కె. నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కె.ఎస్. రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి, టీజీఏఎన్‌బీ డీఎస్పీ సీహెచ్. శ్రీధర్, హైదరాబాద్ మెట్రో రైల్ డీఎస్పీ నాగేందర్ రావు సభ్యులుగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరినే సిట్ దర్యాప్తు అధికారిగా కొనసాగనున్నారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీ అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిట్ అభ్యర్థన మేరకు ఆయన కస్టడీని మరో వారం రోజుల పాటు పొడిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 25 వరకు కస్టోడియల్ విచారణ కొనసాగించవచ్చని, డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
Also Read: WADA 2024 Report: వరుసగా హ్యాట్రిక్.. అగ్రస్థానంలో భారత్,!
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో మాజీ డీఎస్పీ డి. ప్రణీత్ రావు అరెస్టుతో ఈ వ్యవహారం బయటపడగా, ఆ తర్వాత పలువురు పోలీసు అధికారులను కూడా అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ విశ్రాంత డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్ రావు ఈ కేసులో కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది.
ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావు అమెరికాలో ఉన్న సమయంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా, అనంతరం వారు భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు పోలీసుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన సహకారం తక్కువగా ఉందన్న సమాచారం నేపథ్యంలోనే సీనియర్ అధికారులతో కూడిన కొత్త సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదై దాదాపు 21 నెలలు గడిచిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు కావడంతో, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మరింత ఆసక్తికరంగా మారిందని అధికారులు భావిస్తున్నారు.
