Bus Accident: కర్నూలులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల 19 మందిని బలిగొన్న ఘోర ప్రమాదం జరిగిన 24 గంటలు గడవకముందే, కర్నూలు వద్ద మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కర్నూలు సమీపంలో ప్రమాదానికి గురైంది. భారీ వర్షం కురుస్తుండటంతో, ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి ఎదురుగా ఉన్న లారీని ఢీకొట్టింది.
బస్సు డ్రైవర్ అప్రమత్తతతో, చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ముందు అద్దాలు సహా బస్సు ముందు భాగానికి తీవ్ర నష్టం జరిగింది. అయితే, అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణిస్తున్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రయాణికులు ధృవీకరించారు.
Also Read: Kavitha: నేటి నుంచి కవిత జాగృతి జనం బాట ప్రారంభం
ప్రమాదం జరిగిన తర్వాత, బస్సు యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా ధ్వంసమైన బస్సును కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు నడుపుకుంటూ తీసుకువచ్చింది. ఈ విషయాన్ని గుర్తించిన RTA అధికారులు (రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ) వెంటనే స్పందించారు.
హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులను ఆరంఘర్ చౌరస్తా వద్ద దించివేసిన ఆర్టీఏ అధికారులు, బస్సుపై కేసు నమోదు చేశారు. అనంతరం బస్సును బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. 19 మందిని బలిగొన్న గత ప్రమాదం తర్వాత కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్లక్ష్యంపై ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

