CM Chandrababu: అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదాన్ని నింపింది. నిన్న (ఆదివారం) అర్ధరాత్రి పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్టపై జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. మామిడి లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజంపేట నుండి రైల్వే కోడూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, మరణించిన వారంతా రైల్వేకోడూరులోని సెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలేనని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Also Read: Vizag: విశాఖ: నోవాటెల్‌లో రెండో ‘బిమ్స్‌టెక్’ పోర్టుల సదస్సు
కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, క్షతగాతులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి నారా లోకేష్ కూడా పేర్కొన్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.