Anna hajare: ప్రఖ్యాత సామాజిక కార్యకర్త అన్నాహజారే (88) మరోసారి నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌సిద్ధిలో జనవరి 30న ఈ నిరసనను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. లోకాయుక్త చట్టం అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నాహజారే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి లోకాయుక్త వ్యవస్థ అత్యంత కీలకమని, అయినా ప్రభుత్వం పదేపదే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలమవుతోందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, ఈ సమస్యపై తాను చేపట్టబోయే నిరాహార దీక్ష తన చివరి నిరసన అవుతుందేమోనని వ్యాఖ్యానించారు.
2022లో కూడా లోకాయుక్త అమలుకు డిమాండ్ చేస్తూ అన్నాహజారే నిరాహార దీక్ష చేపట్టారు. అప్పట్లో ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను ఉపసంహరించుకున్నారు. అనంతరం ఒక కమిటీ రూపొందించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడింది. అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లోకాయుక్త అమలుపై తాను ఏడు లేఖలు రాసినా, ఎలాంటి స్పందన రాలేదని హజారే ఆవేదన చెందారు. ప్రజా పరిరక్షణ కోసం అత్యంత అవసరమైన ఈ చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదో అర్థం కావడం లేదని తెలిపారు.
