Anjan Kumar Yadav: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంపై సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయంతో మనస్తాపం చెందానని, తాను చాలా సీనియర్‌నని, ఎప్పుడూ ఓడిపోలేదని ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.
బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ) ప్రకటించింది. మొత్తం నలుగురు అభ్యర్థులను పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) సిఫార్సు చేయగా, చివరికి నవీన్ యాదవ్‌ను ఎంపిక చేశారు. ఈ నిర్ణయంపైనే అంజన్ కుమార్ యాదవ్ అలిగినట్లు తెలుస్తోంది.
“కష్టకాలంలో పనిచేశా, మంచి కాలంలో పక్కన పెడతారా?”
పార్టీ చర్యలపై ఆవేదన వ్యక్తం చేసిన అంజన్ కుమార్ యాదవ్, “పార్టీలో నేను చాలా సీనియర్‌ని. నన్ను అందరూ కలిసి ఓడగొట్టారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశాను. కరోనాతో వెంటిలేటర్ మీద చికిత్స తీసుకున్నా. మరి, మంచి కాలం వచ్చేసరికి నన్ను పక్కన పెడతారా?” అని ప్రశ్నించారు.
Also Read: Ponnam Prabhakar: అంజన్ కుమార్ యాదవ్ అలకపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
“నాకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిచేవాణ్ణి” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను నర్సరీ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అనేక పదవులు చేపట్టానని గుర్తు చేసుకున్నారు. తాను రెండుసార్లు హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశానని తెలిపారు.
అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్
మరోవైపు, అంజన్ కుమార్ యాదవ్ అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అంజన్ కుమార్ యాదవ్ గారు జూబ్లీహిల్స్‌లో పోటీ చేయాలని బలంగా కోరుకున్నారని తెలిపారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం వేరే వారికి టికెట్ కేటాయించిందని చెప్పారు.
టికెట్ కేటాయింపు తర్వాత ఏఐసీసీ ఇన్‌ఛార్జీలు మీనాక్షి నటరాజన్, వివేక్ మరియు తాను కలిసి అంజన్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి మాట్లాడామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నేత అని, రెండుసార్లు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.
కరోనా సమయంలో ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ, “హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ యాదవ్ గారు పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్నారు. వారి హయాంలో పార్టీ మరింత అభివృద్ధి చెందుతోంది. పార్టీ ఎప్పుడూ సీనియర్లను గౌరవిస్తుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.