Anil ravipudi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఆదివారం తిరుపతిలో ఘనంగా విడుదల చేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమేనని, థియేటర్లలో అసలు పండగ మొదలవుతుందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు.
ట్రైలర్ విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి,
“మీరు చూసింది రెండున్నర నిమిషాల ట్రైలర్ మాత్రమే. థియేటర్లలో రెండున్నర గంటలకు పైగా సాగే మెగా రైడ్ ఉంటుంది. ఈ సినిమా చూస్తే టైమ్ మెషీన్‌లో ప్రయాణించినట్లే వింటేజ్ చిరంజీవిని చూస్తారు” అని అన్నారు.
తిరుపతి తనకు ఎంతో సెంటిమెంట్ అని చెప్పిన అనిల్ రావిపూడి, ప్రతి సినిమా ప్రారంభం లేదా విడుదల సమయంలో శ్రీవారిని దర్శించుకుంటానని తెలిపారు. చిరంజీవి గారిపై ఉన్న అభిమానంతోనే ఈ కథను ఒక సగటు అభిమానిగా రూపొందించానని చెప్పారు. చిరంజీవి ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్వాగ్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని పేర్కొన్నారు.
శంకరవరప్రసాద్ పాత్రను తాను ఊహించిన దానికంటే చిరంజీవి తన నటనతో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ జోడించారని ప్రశంసించారు. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తన తరం ప్రేక్షకులకు చిరంజీవి, వెంకటేశ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్న కల ఈ సినిమాతో నెరవేరిందని అనిల్ రావిపూడి అన్నారు.
షూటింగ్ సమయంలో సమ్మె కారణంగా కొంత ఆలస్యం జరిగినా, నయనతార పూర్తి సహకారం అందించడంతో సినిమా సమయానికి పూర్తయ్యిందని చెప్పారు. ప్రమోషన్లలో కూడా పాల్గొంటున్న ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు మెగాస్టార్ యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్‌లో అభిమానులను ఉర్రూతలూగించాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
