Anil Chauhan: భారతదేశం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ హెచ్చరించారు. “ఆపరేషన్ సిందూర్” కొనసాగుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా మన సాయుధ దళాలు ఏడాది 365 రోజులు, రోజుకు 24 గంటలు పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని ఆయన స్పష్టంచేశారు.
ఢిల్లీ నగరంలో నిర్వహించిన డిఫెన్స్ సెమినార్‌లో పాల్గొన్న ఆయన, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో సైన్యం కూడా వ్యూహాలు, కార్యాచరణ విధానాలు, నైపుణ్యాల పరంగా స్వయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వివరించారు. ఆధునిక ఆయుధాల వినియోగం మరియు కొత్త పరిజ్ఞానం విషయంలో సైన్యం ఎప్పటికప్పుడు అప్డేట్‌గా ఉండాలని ఆయన సూచించారు.
యుద్ధాల స్వరూపం మారుతున్నదని పేర్కొన్న జనరల్ చౌహాన్, భవిష్యత్తులో సైన్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతోపాటు, సాంకేతిక విజ్ఞానం కలిగిన ‘స్కాలర్ వారియర్స్’ కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. ఏ పరిస్థితికైనా భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పునరుద్ఘాటించారు.