Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌తో ఎదురయ్యే ముప్పులకు భారత్ సిద్ధంగా ఉండాలి

Anil Chauhan: చైనా, పాకిస్థాన్‌లతో కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు, ఉగ్రవాద ముప్పుల నేపథ్యంలో భారత్ స్వల్పకాలికంగానూ, దీర్ఘకాలికంగానూ జరిగే యుద్ధాలను ఎదుర్కొనే స్థాయిలో పూర్తిగా సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.

ఐఐటీ బాంబేలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ చౌహాన్ మాట్లాడుతూ, భారత్‌కు ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు ఉన్నారని, ఆ రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో దేశ భద్రతను కాపాడేందుకు ఎలాంటి సవాలు ఎదురైనా సమర్థంగా స్పందించేందుకు సైన్యం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఉగ్రవాదం, సరిహద్దు వివాదాలు ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లుగా మారాయని ఆయన తెలిపారు. గతంలో నిర్వహించిన సైనిక ఆపరేషన్ల అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలికం వరకూ సాగే ఘర్షణలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఇప్పటికే కొనసాగుతున్న సరిహద్దు వివాదాల కారణంగా భూతల ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన, అవసరమైతే అలాంటి పరిస్థితుల్లో పోరాడేందుకు భారత సాయుధ దళాలు పూర్తిగా సంసిద్ధంగా ఉండాలన్నారు. అయితే యుద్ధ పరిస్థితులను నివారించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తు యుద్ధాల స్వరూపం వేగంగా మారుతోందని అనిల్ చౌహాన్ తెలిపారు. కృత్రిమ మేధస్సు (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, హైపర్‌సోనిక్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలు యుద్ధ విధానాలను పూర్తిగా మార్చుతున్నాయని ఆయన చెప్పారు. ఈ మార్పులకు అనుగుణంగా భారత్ తన రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *