Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక రంగంలో సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఏడాది డిసెంబరు నెలలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా రూ. 2,652 కోట్ల నికర జీఎస్టీ (GST) వసూళ్లను సాధించి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు నెలగా నిలిచింది. జీఎస్టీ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చినప్పటికీ, వాటన్నింటినీ తట్టుకుని రాష్ట్రం ఈ స్థాయి ఆదాయాన్ని గడించడం విశేషం. ముఖ్యంగా ఏప్రిల్ నుండి డిసెంబరు వరకు వరుసగా తొమ్మిది నెలల పాటు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అధిక వసూళ్లు నమోదు కావడం రాష్ట్ర ఆర్థిక పురోగతికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, ప్రజల్లో వస్తు వినియోగం పెరగడమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్ ఎ.బాబు వెల్లడించారు.
జాతీయ స్థాయి గణాంకాలతో పోల్చి చూసినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. దేశవ్యాప్త సగటు జీఎస్టీ వృద్ధి రేటు 5.61 శాతంగా ఉండగా, ఏపీలో అది 5.78 శాతానికి చేరి జాతీయ సగటును మించిపోయింది. గడిచిన తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో మొత్తం రూ. 39,517 కోట్ల జీఎస్టీ వసూళ్లు రాగా, కేంద్రం వాటా ఇతర మినహాయింపులు పోను నికరంగా రూ. 25,926 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి. ఈ గణనీయమైన ఆదాయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయనుంది.
Also Read: Gali Janardhan Reddy: బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. ఒకరు మృతి!
దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని దక్కించుకోవడం మరో విశేషం. 7.85 శాతం వృద్ధితో తమిళనాడు మొదటి స్థానంలో నిలవగా, కర్ణాటక (5.12%), కేరళ (3.69%), తెలంగాణ (2.45%) వంటి పొరుగు రాష్ట్రాలను వెనక్కి నెట్టి ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. రాష్ట్రంలో ప్రధానంగా ఆటోమొబైల్, సిమెంట్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 23.69 శాతం మేర భారీ వృద్ధి నమోదు కావడం ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించింది.
కేవలం జీఎస్టీ మాత్రమే కాకుండా ఇతర పన్ను వసూళ్లలోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఎస్జీఎస్టీ (SGST) రూపంలో రూ. 1,102 కోట్లు, ఐజీఎస్టీ (IGST) సర్దుబాట్ల ద్వారా రూ. 1,549 కోట్ల ఆదాయం లభించింది. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల ద్వారా రూ. 1,448 కోట్ల రాబడి రాగా, వృత్తి పన్ను వసూళ్లు ఏకంగా 38.32 శాతం మేర పెరిగాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వసూళ్లలో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలు, సంస్కరణల కారణంగా మళ్లీ వృద్ధి బాట పట్టిందని అధికార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
