Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చేలా సింగపూర్ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర ఐటీ, ఆర్థిక, జలవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. కేవలం ఎంఓయూలు (మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) కుదుర్చుకోవడం కాకుండా, నేరుగా పెట్టుబడులను కార్యరూపంలోకి తెస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్లలో రూ. 45 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేలా సింగపూర్‌తో ఒప్పందాలు చేసుకున్నట్లు లోకేష్ వెల్లడించారు.
“ఎన్డీఏ కూటమికి ప్రజలు 164 స్థానాలు ఇచ్చారు. ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా కూటమి నినాదం” అని లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోగొట్టుకున్న బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చిందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పరిశ్రమలు వస్తున్నాయని, రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు లోకేష్ వివరించారు.
దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని, ఇందుకోసం కూటమి గెలిచిన వెంటనే ఆర్సెలార్ మిట్టల్‌ను ఆహ్వానించినట్లు లోకేష్ తెలిపారు. విశాఖను ఐటీ మ్యాప్‌లో నిలబెట్టడానికి భూములను తక్కువ ధరకు ఇచ్చామని, ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా టీసీఎస్‌కు 99 పైసల చొప్పున భూమి కేటాయించామని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీకి కూడా 99 పైసలకు భూమి ఇస్తామని ఒప్పించినట్లు ఆయన వెల్లడించారు.
Also Read: Vangalapudi Anitha: జగన్‌పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..
గత వైసీపీ ప్రభుత్వం 2019-2024 మధ్య కాలంలో ఏపీ బ్రాండ్‌ను పూర్తిగా ధ్వంసం చేసిందని లోకేష్ తీవ్రంగా విమర్శించారు. జగన్ రద్దు చేసిన అమర్‌రాజా, లులూ వంటి పలు ఒప్పందాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని ఆరోపించారు. “వైసీపీ తెచ్చిన పెట్టుబడుల కంటే, మా ప్రభుత్వం 14 నెలల్లో తెచ్చిన పెట్టుబడులే ఎక్కువ” అని ఆయన అన్నారు.
సింగపూర్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉందని, గతంలో ఏకపక్షంగా సింగపూర్ ఒప్పందాలను రద్దు చేసి, ఆ ప్రభుత్వంపై అవినీతి ముద్ర వేయడానికి జగన్ ప్రయత్నించారని లోకేష్ గుర్తు చేశారు.
కొందరు వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్‌తో ఒప్పందాలు వద్దంటూ కంపెనీలకు ఈ-మెయిల్స్ పంపుతున్నారని లోకేష్ ఆరోపించారు. పెద్దిరెడ్డి పీఎల్‌ఆర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి ఒకరు, అలాగే మురళీకృష్ణ అనే వ్యక్తి “రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుంది” అంటూ సింగపూర్ అధికారులకు ఈ-మెయిల్స్ పంపినట్లు ఆయన వెల్లడించారు. టీసీఎస్‌కు భూములు ఇస్తే వైసీపీ నేతలు కోర్టులో కేసులు వేశారని, అభివృద్ధి జరగకూడదని, పెట్టుబడులను తరిమేయాలని వైసీపీ చూస్తోందని లోకేష్ విమర్శించారు. “జగన్ అభివృద్ధి చేయరు, చేసేవాళ్లను అడ్డుకుంటున్నారు. ఆయన పాచికలు పారలేదు, త్వరలోనే పెద్దఎత్తున పెట్టుబడులు రానున్నాయి” అని మంత్రి లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.