AP New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ దిశగా మరో చారిత్రాత్మక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ బుధవారం (డిసెంబర్ 31, 2025) నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది. ఈ మార్పులతో ఏపీలో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరగడమే కాకుండా, రెవెన్యూ డివిజన్లు, మండలాల పరిధిలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
28 జిల్లాల ఆంధ్రప్రదేశ్: కొత్తగా మార్కాపురం, పోలవరం
ప్రభుత్వం కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్కాపురం జిల్లాకు మార్కాపురం పట్టణం కేంద్రంగా ఉండగా, పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా వ్యవహరిస్తుంది. ఈ రెండు జిల్లాలకు పాలనా అధికారులను కూడా ప్రభుత్వం తక్షణమే నియమించింది. కొత్త కలెక్టర్లు వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ఉమ్మడి జిల్లాల అధికారులకే అదనపు బాధ్యతలు అప్పగించారు.
పోలవరం జిల్లా: కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, జేసీ శ్రీ పూజ బాధ్యతలు నిర్వహిస్తారు.
మార్కాపురం జిల్లా: కలెక్టర్ రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ రోణంకి గోపాలకృష్ణ అదనపు బాధ్యతలు చూస్తారు.
అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు: రాయచోటి నుంచి మదనపల్లెకు
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు. ఇప్పటివరకు రాయచోటి కేంద్రంగా ఉన్న ఈ జిల్లా కార్యకలాపాలు నేటి నుంచి మదనపల్లె నుంచి సాగనున్నాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా అన్ని ప్రధాన కార్యాలయాలు మదనపల్లెకు మారుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Sankranti Toll Fee: టోల్ ఫ్రీ ప్రయాణానికి సన్నాహాలు.. కేంద్రానికి తెలంగాణ సర్కార్ లేఖ
పెరిగిన రెవెన్యూ డివిజన్లు.. సరిహద్దుల్లో మార్పులు
రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. దీంతో మొత్తం డివిజన్ల సంఖ్య 82కి చేరింది. కొత్త డివిజన్లు ఇవే:
అడ్డరోడ్డు జంక్షన్ (అనకాపల్లి జిల్లా)
అద్దంకి (ప్రకాశం జిల్లా)
పీలేరు (అన్నమయ్య జిల్లా)
మడకశిర (శ్రీసత్యసాయి జిల్లా)
బనగానపల్లి (నంద్యాల జిల్లా)
పలు నియోజకవర్గాల బదిలీ
భౌగోళిక సామీప్యత, పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం పలు నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చింది:
రాజంపేట: అన్నమయ్య జిల్లా నుంచి వైఎస్సార్ కడప జిల్లాలోకి మారింది.
రైల్వేకోడూరు: అన్నమయ్య జిల్లా నుంచి తిరుపతి జిల్లాలో విలీనమైంది.
మండపేట: అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి చేరింది.
అద్దంకి & కందుకూరు: ఈ రెండు నియోజకవర్గాలు ఇప్పుడు ప్రకాశం జిల్లా పరిధిలోకి వచ్చాయి.
గూడూరు: నెల్లూరు జిల్లాలో కలిసింది.
మండలాల స్థాయిలోనూ కొన్ని మార్పులు జరిగాయి. కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని రెండుగా విభజించడంతో రాష్ట్రంలో మొత్తం మండలాల సంఖ్య 681కి పెరిగింది. అలాగే పెనుగొండ మండలం పేరును ‘వాసవీ పెనుగొండ’గా మార్చారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రక్రియ నేటి నుంచి క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
