Andhra Pradesh: ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.ప్లాస్టిక్ వినియోగం వల్ల తలెత్తే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, ప్రత్యామ్నాయ మార్గాలను సూచించగలిగితే ప్లాస్టిక్ రహిత రాష్ట్ర సాధన సులువు అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది.
సచివాలయం నుంచే శ్రీకారం:
ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా, రాష్ట్ర సచివాలయాన్ని ఈ నెల 15 నాటికి ‘ప్లాస్టిక్’ రహితంగా మార్చాలని నిర్ణయించారు. దీని అమలును పర్యవేక్షించేందుకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ఇప్పటికే ఈ నెల 10వ తేదీ నుంచి సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించారు. ఆగస్టు 15 నుంచి పూర్తిస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం అమల్లోకి వస్తుంది.
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి కలిగే నష్టాలను వివరించారు. సచివాలయంలోకి ప్లాస్టిక్ వస్తువులు రాకుండా గేటు వద్దే నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఉద్యోగులకు పునర్వినియోగ స్టీల్ వాటర్ బాటిళ్లను సీఆర్డీఏ ద్వారా అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా, సచివాలయ బ్లాకుల్లో ఆర్వో ప్లాంట్ల ద్వారా తాగునీరు, ఘన, ద్రవ్య వ్యర్థాల సేకరణకు మూడు రకాల డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. క్యాంటీన్లు, ఇతర ప్రాంతాల్లోనూ పునర్వినియోగ స్టీల్ బాటిళ్లను అందుబాటులో ఉంచుతారు.
ప్లాస్టిక్ నిర్మూలనకు పెద్దఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని సురేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, వారికి ప్రత్యామ్నాయాలు చూపించగలిగితే ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని సాధించడం సాధ్యమేనని ఆయన అన్నారు. ఇందుకోసం 2026లో వచ్చే ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్లు వివరించారు.
Also Read: Nara Lokesh: వంశీకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేష్
ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ‘స్వచ్ఛరథం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రజలు తమ ఇళ్లలోని చెత్తను స్వచ్ఛరథం సిబ్బందికి అందజేస్తే, దానికి సమానమైన నిత్యావసరాలను ఉచితంగా అందిస్తారు. ఈ విధానం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు.
ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని అధికంగా వినియోగిస్తున్నందున, ఇది ఒక్కసారిగా పూర్తయ్యే కార్యక్రమం కాదని సురేష్ కుమార్ తెలిపారు. అందుకే అంచెలంచెలుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. ఆగస్టు 15 నుంచి సచివాలయం నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నీటి వనరుల్లో కలిసే ప్లాస్టిక్ అవశేషాలు మానవ దేహంలోకి వెళ్లి క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతున్నాయని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోందని పునరుద్ఘాటించారు.

