భారీ వర్షాలపై ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు పంపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు, మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చెరువులు, కాల్వలు, నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్తినష్టం లేకుండా చూడాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించాలని చెప్పారు. కాగా NDRF, SDRF బృందాలను సిద్ధంగా ఉంచామని సీఎంకు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్, స్పెషల్ సీఎస్ సిసోడియా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసు, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, R&B శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది. బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
ఇక అమరావతిలో రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్కిల్ డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఫెసిలిటేషన్ కేంద్రంగా దీనిని మారుస్తామన్నారు. ‘MSME, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు 5% ఇన్సెన్టివ్స్ ఇస్తాం. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకం అందిస్తాం’ అని పరిశ్రమలపై సమీక్షలో సీఎం వెల్లడించారు.