Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి పులి వణికిస్తోంది. గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ (10 డిగ్రీల కంటే తక్కువ) ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో జనం గజగజ వణికిపోయారు. అయితే, గత రెండు రోజులుగా చలి తీవ్రత స్వల్పంగా తగ్గినట్లు అనిపించినా.. ఇది తాత్కాలికమేనని, మున్ముందు చలి మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈశాన్య, తూర్పు దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రమంతటా వాతావరణం పొడిగా ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున ఒకటి లేదా రెండు చోట్ల దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. అయితే, రాగల ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, కానీ చలి గాలుల ప్రభావం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
తెలంగాణలో పొగమంచు ముసుగు.. తెలంగాణలో కూడా వాతావరణ పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీనివల్ల శని, ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత మళ్లీ పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
ప్రజలకు సూచనలు.. చలి పెరుగుతున్న నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున ప్రయాణాలు చేసేవారు పొగమంచు వల్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వేడి పానీయాలు తీసుకోవడం, ఉన్ని దుస్తులు ధరించడం ద్వారా చలి నుంచి ఉపశమనం పొందవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిది.
