YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తన తండ్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి అసలైన రాజకీయ వారసుడు తన కుమారుడు రాజారెడ్డి అని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల స్పష్టం చేశారు. వై.ఎస్.ఆర్ వారసత్వంపై నెలకొన్న చర్చకు ఆమె తన విజయవాడ పర్యటనలో ముగింపు పలికారు. వైకాపా నాయకుల ఆరోపణలను, ప్రచారాలను ఆమె తీవ్రంగా ఖండించారు.
తన కుమారుడు ఇంకా రాజకీయాల్లో అడుగు పెట్టకుండానే వైకాపా నాయకులు భయపడుతున్నారని షర్మిల ఎద్దేవా చేశారు. వై.ఎస్.ఆర్ స్వయంగా తన మనవడికి రాజారెడ్డి అని పేరు పెట్టారని ఆమె గుర్తుచేశారు. అయితే, తన కుమారుడు చంద్రబాబు సూచన మేరకు రాజకీయాల్లోకి వస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోలను తాము చూసి నవ్వుకున్నామని చెప్పారు. ‘‘చంద్రబాబు చెబితే నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తే, మరి ఎవరు చెబితే జగన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ అభ్యర్థికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
Also Read: IAS Transfers: 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
బీజేపీతో జగన్ రహస్య పొత్తు:
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం బీజేపీకి తోక పార్టీలా వ్యవహరించిందని షర్మిల విమర్శించారు. వై.ఎస్.ఆర్ తన జీవితకాలం బీజేపీని వ్యతిరేకించారని, కానీ ఇప్పుడు జగన్ బీజేపీకి దాసోహం అయ్యారని అన్నారు. “జగన్ మోదీకి దత్తపుత్రుడు. టీడీపీ, జనసేన బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, జగన్ రహస్యంగా పొత్తు పెట్టుకున్నారు” అని షర్మిల ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతివ్వడం ద్వారా వై.ఎస్.ఆర్ ఛాతిలో కత్తితో పొడిచిన వ్యక్తిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో షర్మిల ప్రజల సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రైతులకు సరైన మద్దతు ధర అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని షర్మిల హామీ ఇచ్చారు. అలాగే, వైకాపా ప్రవేశపెట్టిన ‘సూపర్ సిక్స్’ పథకాలు ప్రజలకు అందడం లేదని, అవి ‘సూపర్ ఫ్లాప్’ అయ్యాయని ఆమె ఆరోపించారు.