Anantha Sriram: తెలుగు సినీ సంగీత ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించిన గీతరచయిత అనంత్ శ్రీరామ్, తన సాహిత్య పటిమతో ఎన్నో పాటలకు కొత్త అందం జోడించారు. పదాల మాంత్రికుడిగా పేరొందిన ఆయన, ఇటీవల హిట్ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రయాణం, సవాళ్లు, అనుభవాలను పంచుకున్నారు.
అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ –
“నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడప్పుడూ మంచి పాటలు రాసినా, దర్శక–నిర్మాతలకు నాపై నమ్మకం ఏర్పడటానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. లవ్ సాంగ్స్‌తో పాటు మాస్ సాంగ్స్‌కీ వరుస హిట్లు ఇచ్చాను. అయితే ఒక దశలో ‘లవ్ సాంగ్స్ బాగా రాయగలడు’ అన్న ముద్ర వేసి అవే రాయించేవారు. దాంతో కొంతకాలం లవ్ సాంగ్స్ రాయడాన్ని ఆపేసి, మాస్ సాంగ్స్‌కే పరిమితమయ్యాను” అని గుర్తుచేశారు.
ఇక తన కెరియర్‌పై మాట్లాడుతూ –
“ఇప్పటివరకు 1500 పాటలు రాశాను. 19 ఏళ్ల ప్రయాణం తర్వాత ఇప్పుడు నేను అనుకున్న స్థాయికి వచ్చానని అనుకుంటున్నాను. ఒక మంచి పాట రావాలంటే, కొత్త పదాలు పడాలంటే దర్శకుడికి కూడా తగిన సాహిత్య అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే సాహిత్యానికి నిజమైన అందం వస్తుంది” అన్నారు.
ఇండస్ట్రీ పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ –
“హీరోగా, దర్శకుడిగా, డీఓపీగా విఫలమైన వాళ్లు కూడా చివరికి పాటలు రాయాలని చూస్తున్నారు. తెలిసిన కొన్ని పదాల పరిధిలోనే అనేక భావాలను వ్యక్తపరచాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం చెప్పాలంటే పాటల రచయిత పరిస్థితి రోజురోజుకు కఠినమవుతోంది. కానీ పాటలు రాయాలని నిజంగా కోరుకునేవాళ్లు తక్కువ కావడంతో, అలాంటి వారే ఇంకా మేము ఈ రంగంలో మనుగడ కొనసాగిస్తున్నాము” అని అన్నారు.
మొత్తంగా, తెలుగు పాటలకు కొత్త ప్రాణం పోసిన అనంత్ శ్రీరామ్ మాటల్లో సాహిత్య విలువ, రచయితల సవాళ్లు, సంగీత పరిశ్రమలోని వాస్తవాలు ప్రతిబింబించాయి.