Anam ramnarayan: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయని ఏపీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలని, కానీ కేసీఆర్ వ్యాఖ్యలు ఆ పరిమితులను దాటుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రపంచమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఒక స్టేట్స్‌మన్‌గా కీర్తిస్తోందని మంత్రి గుర్తుచేశారు. అలాంటి నేతపై కేసీఆర్ విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. “కేసీఆర్‌కు నచ్చితే ఎంత? నచ్చకపోతే ఎంత?” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో కృష్ణపట్నం పోర్టును తిరుపతి జిల్లాలో కలపాలని ప్రయత్నాలు జరిగాయని మంత్రి ఆనం వెల్లడించారు. పరిపాలన పరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై బురదజల్లడం సరికాదన్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకునేలా ప్రతిపక్షం వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. ప్రజల సమస్యలపై నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, కానీ రాజకీయ ప్రయోజనాల కోసమే విమర్శలు చేస్తున్నారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
