Anakapalli: ఏంటీ టైటిల్.. సార్లయితే నిద్ర రాదా.. నిద్ర పోకూడాదా అంకుంటున్నారా? నిజమే మనిషి అన్నవాడు నిద్రపోకపోతే కష్టమే. కష్టపడి పని చేసి.. కాస్త రెస్ట్ తీసుకోవడం తప్పనిసరి కూడానూ. కానీ, ఆఫీసుకు వెళ్లి.. హాయిగా భోంచేసి.. బజ్జోవడమే ఇక్కడ అభ్యంతరకరం. అవును.. ఆయనో ప్రభుత్వ అధికారి. అదీ ప్రజలతో నిత్యం మమేకమై పనిచేయాల్సిన అధికారి. ఎన్నో ఇబ్బందులు.. కష్టాలతో ప్రజలు ఆయన దగ్గరకు వస్తారు. ఆఫీసు టైం లో ఆయన తినేసి పడుకుంటే, దూరాభారం నుంచి వచ్చిన ప్రజల పరిస్థితి ఏమిటి?
ఇదిగో ఈ ఎంపీడీవో చేస్తున్న పని అదే. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మంండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఓ కొత్త విషయం చెబుతున్నారు. విధి నిర్వహణ సమ యంలో విశ్రాంతి తీసుకుంటే తప్పేంటంటూ ఎంపీడీవో ప్రభాకరరావు కొత్త భాష్యం చెబుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిత్యం మాదిరే శుక్రవారం విధులకు వచ్చిన ఎంపీడీవో మధ్యాహ్నం భోజనం సమయంలో కార్యాలయానికి ఆనుకొని ఉన్న జెడ్పీ అతిథి గృహంలో విశ్రాంతి తీసు కోవడానికి వెళ్లిపోయారు.
ఇది కూడా చదవండి: Salman Khan: సల్మాన్ ఇంటిపై కాల్పులు.. నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీస్
Anakapalli: అచ్యుతాపురం మండలంలో వెలుగు కార్యాలయం, పీహెచ్సీ, ఎంఈవో కార్యాలయం, పోలీస్ స్టేషన్, రెవెన్యూ అన్ని ఒకే చోట ఉంటాయి. ప్రజలు అనేక సమస్యలపై కార్యాలయాలకు వస్తుంటారు. ఇదే సమయంలో ఎంపీడీఓకి సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన అర్జీదారులకు ఈ అధికారి అందుబాట్లో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. సార్ ఎప్పుడొస్తారని సిబ్బందిని ప్రశ్నిం చారు. దీంతో తమ సార్ జెడ్పీ అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారని వారు సెలవిచ్చారు. దీంతో సారువారి కోసం ఎదురుచూస్తున్న అక్కడున్న వారంతా తెలముఖం వేశారు. డ్యూటీ టైంలో విశ్రాంతి ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీడీవోగా ఇటీవలే బదిలీపై వచ్చిన ప్రభాకరరావు జెడ్పీ అతిథి గృహంలో హాయిగా విశ్రాంతి తీసుకుటుండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎంపీడీవో ప్రభాకరరావును మీడియా వివరణ కోరగా ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన తరువాత ప్రతిరోజూ ఓ గంట పడుకోవడం తనకు అలవాటని తీరిగ్గా చెప్పుకొచ్చారు.
అదండీ విషయం. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన ఒక్కరు ఆఫీసు సమయంలో నిద్రపోతే.. సమస్యలతో అక్కడికి వచ్చిన వందలాది మంది ప్రజలు ఏమి చేయాలి? వారి బాధలు ఎవరు తీర్చాలి? ఇవి జవాబు లేని ప్రశ్నలే!