Anagani satyaprasad: మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రేపల్లెలో మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ నష్టం, సహాయక చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
మంత్రి అనగాని మాట్లాడుతూ,”కూటమి ప్రభుత్వం వచ్చి వెంటనే ఎదురైన ఈ భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఆరు రోజుల పాటు మైక్రో లెవల్లో పరిస్థితులను పర్యవేక్షించారు. వారి కృషి వల్లే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరగకుండా చేశాం” అని అన్నారు.
పంట నష్టం అంచనాలు సేకరిస్తున్నామని తెలిపిన ఆయన, రైతులకు హెక్టార్‌కు రూ.25 వేలు వరకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తుఫాన్ కారణంగా ఇద్దరు మృతిచెందిన ఘటనలు విచారకరమని తెలిపారు.
అక్కడి పరిస్థితిని విశ్లేషిస్తూ మంత్రి అనగాని మాట్లాడుతూ,”విపత్తు సమయంలో కూటమి నేతలు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ రంగంలోకి దిగారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా కనిపించలేదు” అని విమర్శించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో పోలిస్తే, మాజీ సీఎం బాధితులను తన దగ్గరకు రప్పించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
ఇళ్లకు నష్టం జరిగిన వారికి, మత్స్యకారులకు కూడా ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని, మత్స్యకారులకు అదనపు సాయం కూడా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

