Gas Fee To Hotel Bills: సాధారణంగా హోటల్‌కు వెళితే మనం తిన్న ఆహారానికి, జీఎస్టీకి కలిపి బిల్లు చెల్లిస్తాం. కానీ ఇప్పుడు వీటికి తోడు అదనంగా ‘గ్యాస్ ఛార్జీ’ కూడా కట్టాల్సిన పరిస్థితి వస్తోంది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధ మేఘాల వల్ల క్రూడాయిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల మన దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు భారీ కొరత ఏర్పడింది. ప్రభుత్వం గృహ అవసరాలకు ఇచ్చే వంట గ్యాస్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో, హోటళ్లకు సరఫరా తగ్గుతోంది. ఈ పరిస్థితులనే సాకుగా చూపుతూ కొన్ని నగరాల్లో హోటల్ యాజమాన్యాలు కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి.
ముఖ్యంగా చెన్నై వంటి నగరాల్లో ఈ కొత్త బాదుడు మొదలైంది. హోటల్‌లో ఏం తిన్నా సరే, చివరగా ఇచ్చే బిల్లులో అదనంగా 10 రూపాయలను ‘గ్యాస్ ఛార్జీ’ పేరుతో వసూలు చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి హోటల్ తిండి సామాన్యుడికి భారం కాగా, ఇప్పుడు ఈ అదనపు వసూళ్లు వినియోగదారులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. చిన్న హోటళ్లలో కూడా దోశ ధర 60 రూపాయలు, ఇడ్లీ ధర 50 రూపాయల వరకు పలుకుతుండటం గమనార్హం.
మరోవైపు హోటల్ యజమానులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అసలు దొరకడం లేదని, బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్‌ను దాదాపు 5 వేల నుంచి 6 వేల రూపాయల వరకు పెట్టి కొనాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అంత ధర పెట్టి కొన్నప్పుడు ఆ భారాన్ని తాము భరించలేమని, అందుకే కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నామని సమర్థించుకుంటున్నారు. అయితే, ఇలా ఇష్టారాజ్యంగా అదనపు ఛార్జీలు వసూలు చేయడంపై ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.
