Amit Shah: తెలంగాణలో ప్రభుత్వం మారినా.. అవినీతి తీరులో మాత్రం మార్పు రాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. ఆదివారం నిజామాబాద్‌లో జరిగిన రైతు సమ్మేళనంలో ఆయన పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఢిల్లీకి ఏటీఎం..?
“తెలంగాణలో బీఆర్ఎస్ హయాం ముగిసినా, అవినీతి పోయింది కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే మార్గంలో నడుస్తోంది. కేసీఆర్ ధరణి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కానీ కాంగ్రెస్ ఎందుకు విచారణ జరపడం లేదు? ఎందుకంటే వాళ్లూ వీళ్లూ కలిసి దొందూ దొందే!” అంటూ అమిత్ షా గరంగరంగా ఆరోపించారు.
“తెలంగాణను ఢిల్లీ పెద్దల ఏటీఎంగా మార్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు న్యాయం చేయలేకపోతోంది” అని కూడా ఆయన మండిపడ్డారు.
పసుపు రైతులకు శుభవార్త
నిజామాబాద్ పసుపు రైతుల కల నెరవేరిందని, నాలుగు దశాబ్దాల పోరాటం తరువాత కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయడం గర్వకారణమని అమిత్ షా తెలిపారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇచ్చిన హామీ నెరవేరిందని ఆయన చెప్పారు.
ఇది కూడా చదవండి: KK Mahender Reddy: అధికారం కోల్పోయిన BRS అహంకారం తగ్గలేదు
“ఇకపై నిజామాబాద్ పసుపు ప్రపంచ విపణిలో ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది. భారత్ ఆర్గానిక్, భారత్ ఎక్స్‌పోర్ట్ సంస్థలూ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు.
నక్సలిజానికి గుడ్‌బై చెబుదాం – 2026 వరకు టైమ్
నక్సలైట్లకు తుది హెచ్చరిక జారీ చేస్తూ అమిత్ షా స్పష్టం చేశారు – “2026 మార్చి 30 నాటికి దేశంలో నక్సలిజం అనే పదమే లేకుండా చేస్తాం. తుపాకులు పక్కన పెట్టి ప్రజల్లో కలవండి. లేదంటే చర్యలు తీవ్రమవుతాయి” అని హెచ్చరించారు.
మోదీ గ్యారెంటీ అంటే నమ్మకమే
“మోదీ ఏది చెబితే అది చేస్తారు. రైతు అభివృద్ధి, దేశ భద్రత, అవినీతి నిర్మూలన – మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు. ఇది మాట కాదు.. మోదీ గ్యారెంటీ!” అని అమిత్ షా చెప్పడంతో సభా ప్రాంగణం శబ్దంతో మారుమోగింది.

