Zoho -Amit Shah: దేశీయ ఉత్పత్తులు, సేవలను వినియోగించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును కేంద్రమంత్రులు అందిపుచ్చుకుంటున్నారు. స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు జోహో ప్లాట్ ఫామ్ వైపు మొగ్గుచూపుతున్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే ఆ సంస్థ సేవలు వినియోగిస్తుండగా.. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోహో మెయిల్ లోకి మారిపోయారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాను జోహో మెయిల్ కు మారానని….ఈమెయిల్ చిరునామాలో ఈ మార్పును గమనించండని పోస్టు చేశారు. amitshah.bjp@ zohomail.in తన కొత్త మెయిల్ అడ్రెస్ అని అమిత్ షా రాసుకొచ్చారు.
ఇది కూడా చదవండి: Trump Tariffs: భారత్‌పై సుంకాలను రద్దు చేయాలి!
ఇకనుంచి మెయిల్స్ అన్నీ ఈ కొత్త అడ్రస్ కే పంపాలని సూచించారు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ బదులు జోహో రూపొందించిన పవర్ పాయింట్ తో కేబినెట్ వివరాలను అశ్వినీ వైష్ణవ్ వెల్లడిస్తున్నారు. జోహో రూపొందించిన మెసేజింగ్ యాప్ అరట్టైని వాడాలంటూ మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడంపై మళ్లీ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో షా జోహో మెయిల్‌కు మారారు. జోహో అనేది చెన్నైకి చెందిన ప్రముఖ భారతీయ బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థ. జోహోను 1996లో శ్రీధర్ వెంబు మరియు టోనీ థామస్ అడ్వెంట్‌నెట్‌గా స్థాపించారు మరియు 2009లో జోహోగా పేరు మార్చారు. వెంబు కంపెనీకి చీఫ్ సైంటిస్ట్‌గా పనిచేస్తుండగా, థామస్ దాని US కార్యకలాపాలను చూసుకుంటున్నారు.