Amit sha: ప్రపంచంలోనే అతి ప్రాచీన భాషగా తమిళాన్ని ప్రశంసించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తాను ఆ భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తమిళ ప్రజలు తనను క్షమించాలని కోరారు. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రం మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా, అమిత్ షా 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి అనివార్యమని వ్యాఖ్యానించారు. 2024 సంవత్సరం బీజేపీకి చారిత్రాత్మకంగా నిలిచిందని, అదే ఏడాది నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని అన్నారు.
ఇంతకాలం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చిందని, మహారాష్ట్ర, హర్యానా, అలాగే ఇటీవల ఢిల్లీలో కూడా ప్రజలు బీజేపీపై విశ్వాసం ఉంచారని తెలిపారు. కుటుంబ రాజకీయాలను, అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తూ 2026లో తాము తమిళనాడులో విజయం సాధిస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.