America:అమెరికా దేశంలో హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుం పెంపుతో ఆ రెండు దేశాలకే తీరని నష్టం కలగనున్నది. ఆ దేశాల నుంచి అత్యధికంగా ఇంజినీర్లు, ఇతర రంగాలకు చెందిన యువత ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తుంది. అయితే వారిని ఇక నుంచి చేర్చుకోవాలంటే టెక్, ఇతర కంపెనీలు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇతర దేశాల వారిని తమ కంపెనీల్లో నియమించుకోవాలంటే ఏటా హెచ్1బీ వీసా కింద లక్ష డాలర్లను చెల్లించాలని నిబంధనను తీసుకొచ్చింది. ఇది టెక్, తదితర కంపెనీలకు పిడుగులాంటి వార్తేనని చెప్పుకోవచ్చు.
America:ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులు, చైనా దేశీయులకు హెచ్1బీ వీసా రుసుం పెంపు వార్త పిడుగులాంటిదేనని చెప్పుకోవచ్చు. అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఇటు ఇండియా, అటు చైనా వ్యతిరేక విధానాలకే ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా 50 శాతం దిగుమతి సుంకాలు పెంచి భారత్‌పై అమెరికా కక్ష్యసాధింపు చర్యలకు దిగింది.
America:ఇప్పటికీ ఇండియా, చైనా దేశాలకు చెందిన నిపుణులే లక్షలాది మంది హెచ్1 బీ వీసాల కింద అక్కడ ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. ఇంకా లక్షలాది మంది గ్రీన్‌కార్డు వీసాతో అక్కడే స్థిరపడిపోయారు. తాజాగా హెచ్1బీ వీసా రుసుం పెంపుతో ఆ రెండు దేశాల నుంచి నిపుణులు వెళ్లేందుకు అవకాశాలు తగ్గుముఖం పడుతాయి.
America:తాజాగా భారత్, చైనా యువతను చేర్చుకునేందుకు కంపెనీలు వెనుకా, ముందు ఆలోచించాల్సి వస్తున్నది. దీంతో ఆయా కంపెనీలు ఇండియా, చైనా నిపుణులను చేర్చుకోవాలన్నా సంశయించాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే పెద్ద కంపెనీలకు అమెరికా ప్రభుత్వం వీసా రుసుం పెంపు సమాచారాన్ని చేరవేసినట్టు తెలిసింది. మున్ముందు టెక్ కంపెనీలు ఏమైనా అభ్యంతరాలను వ్యక్తంచేస్తే, అమెరికా ప్రభుత్వం ఏమైనా సడలించే అవకాశం ఉంటుందేమోనని వేచి చూడాలి మరి.