America: అమెరికాలో మరో విషాదం చోటుచేసుకున్నది. ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు యువకుడు అక్కడ జరిగిన ఓ ప్రమాదంలో చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆ యువకుడు అమెరికాలోని బోస్టన్‌లో ఉంటూ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. అక్కడి ఓ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లిన అతను దానిలోనే మునిగి చనిపోయాడని తెలిసింది.
America: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడైన లోకేశ్ (23) బోస్టన్‌లోనే ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 3న ఈతకోసం స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. దానిలోకి దిగి మునిగి చనిపోయాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మృతదేహాన్ని మార్టూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
America: ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్దరిస్తాడనుకున్న కన్నకొడుకు అక్కడే కన్నుమూయడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు అక్కడి స్థానిక తెలుగు ఎన్నారైలతోపాటు అధికారులు సహాయం చేస్తున్నారు. మార్టూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.