America: ప్రముఖ అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బెన్ భారత్‌పై, భారత రాజకీయ నాయకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయన నాయకత్వం అత్యద్భుతమని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్‌ను నడిపించగల సత్తా కలవారని తాను నమ్మనని ఆమె స్పష్టం చేశారు.
ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మిల్బెన్ మాట్లాడుతూ “భారతదేశానికి నాయకత్వం వహించేందుకు రాహుల్ గాంధీ తగిన వ్యక్తి కాదు. ఆయన విదేశాల్లో ఎక్కువ సమయం గడిపి, తన సొంత దేశాన్నే విమర్శించడం అలవాటుగా మారింది. ప్రజలు ఇప్పటికే మోదీ నాయకత్వాన్ని మూడు సార్లు ఎన్నికల ద్వారా ఆమోదించారు. ఇది ఆయన ప్రజాదరణకు నిదర్శనం” అని పేర్కొన్నారు.ఆమె ఇంకా అన్నారు “రాహుల్ గాంధీ అమెరికాకు వచ్చినప్పుడల్లా భారత్ గురించి, ప్రధాని మోదీ గురించి ప్రతికూలంగా మాట్లాడతారు. తమ దేశ ప్రజలను ఎప్పుడూ విమర్శించే వ్యక్తి ఆ దేశాన్ని ఎలా నడపగలడు?”
కాంగ్రెస్ మద్దతుదారులు తనను ట్రోల్ చేస్తున్నప్పటికీ, తాను చెప్పిన అభిప్రాయంపై నిలబడతానని మిల్బెన్ స్పష్టం చేశారు.
ప్రధాని మోదీతో తానున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న మిల్బెన్ “ఐక్యరాజ్యసమితిలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీతో కలిసి పాల్గొనడం నా జీవితంలోని మరచిపోలేని క్షణం. ఆయన ప్రశాంత స్వభావం, స్నేహపూర్వకత నన్ను ఆకట్టుకుంది” అని చెప్పారు.మోదీ ఉగ్రదాడుల అనంతరం చూపిన ధైర్యవంతమైన నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు.
మిల్బెన్ తెలిపిన వివరాల ప్రకారం —
తన చిన్నతనంలో భారతీయ మహిళ స్మితా పాటిల్ తనను చూసుకుందని, ఆమె ద్వారానే భారతీయ సంస్కృతి, సంగీతం, ఆహారం పట్ల మక్కువ పెరిగిందని అన్నారు. “భారతదేశం నాకు రెండో ఇల్లులాంటిది” అని గాయని పేర్కొన్నారు.

