Ambati Dance

Ambati Dance: సంక్రాంతి సందడిలో అంబటి రాంబాబు డ్యాన్స్.. కూటమి ప్రభుత్వంపై వినూత్న విమర్శలు

Ambati Dance: సంక్రాంతి పండుగ అంటేనే వినోదం, విందులు.. కానీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు మాత్రం పండుగ వేళ రాజకీయ విమర్శలకు తనదైన శైలిలో కొత్త రూపునిచ్చారు. ప్రతి ఏటా సంక్రాంతికి ప్రత్యేకంగా స్టెప్పులేస్తూ వార్తల్లో నిలిచే ఆయన, ఈసారి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన వేడుకల్లో మరోసారి అదరగొట్టారు. అయితే ఈసారి ఆయన డ్యాన్స్ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ సాగడం విశేషం.

సత్తెనపల్లిలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు ఒక ప్రత్యేకమైన పాటను ఎంచుకున్నారు. “సంక్రాంతి పండుగ వచ్చింది.. కానీ దగాకోరు పాలనలో పేదల జీవితాల్లో చీకటిని తెచ్చింది” అనే అర్థం వచ్చేలా రూపొందించిన పాటపై ఆయన తన బృందంతో కలిసి కాలు కదిపారు. కూటమి ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూ సాగిన ఈ పాట ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అంబటి వేసిన స్టెప్పులను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

నిజానికి అంబటి రాంబాబుకు డ్యాన్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా సంక్రాంతి వేళ సంప్రదాయ వేషధారణలో డ్యాన్స్ చేసి అందరినీ అలరించేవారు. అప్పట్లో అది కేవలం పండుగ సంబరంలా ఉంటే, ఈసారి మాత్రం రాజకీయ విమర్శలను మేళవించి తనదైన స్టైల్‌లో నిరసనను వ్యక్తం చేశారు. విమర్శలు ఎలా ఉన్నా, రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకోవడంలో అంబటి మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *