Ambati Rambabu

Ambati Rambabu: అరెస్టులకు భయపడేది లేదు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

Ambati Rambabu: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూనే, ప్రస్తుత పరిణామాలపై తనదైన శైలిలో స్పందించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తాను కావాలని అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, ఆ సమయంలో జరిగిన పరిస్థితుల వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.

ఘర్షణకు అసలు కారణం ఇదే.. టీటీడీ లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అక్రమంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆ ఫ్లెక్సీలను తొలగించమని తాను మర్యాదగా కోరానని, తాను వాటిని చించడానికి వెళ్ళలేదని స్పష్టం చేశారు. నేను కేవలం వెంకన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటే, కావాలని నా దారికి అడ్డుపడి కొందరు నన్ను బూతులు తిట్టారు. నన్ను చంపడానికి రాడ్లు, కర్రలతో దాడికి ప్రయత్నిస్తే, ఆ ఆవేశంలో నేను కూడా మాట్లాడాల్సి వచ్చింది అని ఆయన చెప్పుకొచ్చారు.

చంద్రబాబుపై వ్యాఖ్యలపై క్లారిటీ చంద్రబాబు నాయుడు పెద్ద నాయకుడని, ప్రజలు ఆయనను ఎన్నుకున్నారని అంబటి గుర్తు చేశారు. తాను ఆయనను ఉద్దేశపూర్వకంగా తిట్టలేదని, తనపై దాడి జరిగినప్పుడు ప్రాణ రక్షణ కోసం కేకలు వేశానని తెలిపారు. అయితే, ఆ వయసులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. తన చుట్టూ జరుగుతున్న విమర్శలన్నిటికీ త్వరలోనే పూర్తిస్థాయిలో సమాధానం చెబుతానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అరెస్టులకు సిద్ధం.. ‘ఐ డోంట్ కేర్’ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఆ విషయం తనకు ముందే తెలుసని అంబటి రాంబాబు అన్నారు. “నన్ను అరెస్ట్ చేస్తారా? చేసుకోండి.. ఐ డోంట్ కేర్! నేను దేనికీ భయపడను, పారిపోను, కనీసం బెయిల్ కోసం కూడా వెళ్ళను” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పోలీసులు తమపై దాడులు చేస్తున్న వారిని వదిలేసి, బాధితులైన తమపై చర్యలు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చెబుతున్న ‘రెడ్ బుక్’ బెదిరింపులను తాను అస్సలు లెక్కచేయనని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *