Ambati Rambabu: తాడేపల్లిలోని నివాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. ఇటీవల ఒక కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన అంబటి, తనకు ఎదురైన పరిణామాలను జగన్‌కు వివరించారు. కూటమి ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందని, టీడీపీ శ్రేణులు తన ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘటన గురించి కూడా ఈ సందర్భంగా చర్చించారు.
అంబటి మాటలు విన్న జగన్ ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. “అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదు, చట్టపరంగా పోరాడి విజయం సాధిద్దాం” అని ధైర్యం చెప్పారు. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులను తాము చూస్తూ ఊరుకోమని, నాయకులు, కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజల కోసం మనం చేసే పోరాటంలో ఇలాంటి అడ్డంకులు సహజమని, వాటిని ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
అయితే, కొంతమంది పోలీసు అధికారుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న అధికారుల వైఖరి సరికాదని తప్పుబట్టారు. చట్టాన్ని అతిక్రమించి పని చేస్తున్న వారు భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యలపై గళం ఎత్తుదామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో అంబటి రాంబాబుతో పాటు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ నందిగాం సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది.
