Amazon: ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీ ఉద్యోగ కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్‌లో 800 నుంచి 1,000 మంది వరకు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.
ఈ తొలగింపులు ప్రధానంగా ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, టెక్ విభాగాల్లో జరిగే అవకాశముంది. అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కంపెనీలో లేఆఫ్స్ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు గమనించవచ్చు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యల్లో, జెనరేటివ్ ఏఐ ప్రభావం కారణంగా భవిష్యత్తులో కార్పొరేట్ సిబ్బంది సంఖ్య తగ్గొచ్చని స్వయంగా వెల్లడించారు.
గతంలో కూడా అమెజాన్ పలు దఫాల్లో ఉద్యోగులను తొలగించింది — 2023 మార్చిలో 9,000 మందిని, రెండు నెలలక్రితం 18,000 మందిని తొలగించింది. ఆ తొలగింపులో భారత్‌లో 500 మంది ఉద్యోగాలు కోల్పోయారు.
ప్రస్తుతం కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ వ్యయాలను తగ్గించుకునే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలగింపుకు గురయ్యే ఉద్యోగులకు మూడు నెలల పాటు కంపెనీ లోపలే కొత్త ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడానికి అవకాశం ఇవ్వనుంది.
ఆ అవకాశాన్ని వినియోగించుకోకపోతే, వారికి సెవరెన్స్ పే, అవుట్ ప్లేస్‌మెంట్ సేవలు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు అందజేయనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.ఒకప్పుడు ఉద్యోగ కలలగడిన అమెజాన్, ఇప్పుడు ఏఐ విప్లవ దిశగా మార్పులు చేసుకుంటూ — సిబ్బందిపై వ్యయ నియంత్రణను ప్రధాన లక్ష్యంగా తసుకుంటోంది.

