Curd with Sugar: చాలా మందికి భోజనంలో తప్పనిసరిగా పెరుగు తినే అలవాటు కలిగి ఉంటారు. కొంతమంది పెరుగులో ఉప్పు వేసుకొని తింటే, మరికొందరు చక్కెర వేసి తినడాన్ని ఇష్టపడతారు. అయితే, పెరుగులో చక్కెర కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పెరుగు సహజ ప్రోబయోటిక్ ఆహారం. ఇందులో ఉండే “లాక్టోబాసిల్లస్”, “బైఫైడోబాక్టీరియం” అనే మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, మలబద్ధకం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
పెరుగులో చక్కెర కలపడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉదయం అల్పాహారం తర్వాత లేదా వ్యాయామం చేసిన వెంటనే పెరుగు, చక్కెర కలిపి తింటే శరీరానికి అవసరమైన కేలరీలు అందుతాయి. ఇది అలసటను తగ్గించి శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
పెరుగులో ఉన్న కాల్షియం, ప్రోటీన్లు ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి. పెరుగును ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారి, శరీరానికి బలాన్ని అందిస్తుంది. చక్కెరతో కలిపి తినడం వలన విటమిన్ బి12, ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచి, మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. చక్కెర కలిపిన పెరుగు రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు శరీరాన్ని రోగాల నుండి రక్షిస్తాయి. వేడి వాతావరణంలో పెరుగు చల్లదనాన్ని ఇచ్చి, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. డీహైడ్రేషన్‌ను నివారించడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే, ఈ మిశ్రమాన్ని మితంగా మాత్రమే తీసుకోవాలి. చక్కెరను అధికంగా కలపడం వలన క్యాలరీలు పెరిగి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర లేకుండా పెరుగును మాత్రమే తీసుకోవడం మంచిది. అలాగే లాక్టోస్ ఇన్టాలరెన్స్ ఉన్నవారు లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నవారు ఈ మిశ్రమాన్ని నివారించాలి. పెరుగు, చక్కెర సరైన మోతాదులో తీసుకుంటే శరీరానికి శక్తి, జీర్ణక్రియ మెరుగుదల, మానసిక ప్రశాంతత వంటి అనేక లాభాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు సరైన పరిమాణంలో పెరుగు, చక్కెర కలిపి తినడం ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు.


