Amarnath Yatra: జులై 3 నుంచి ప్రారంభం కానున్న అమర్ నాథ్ యాత్రకు మల్టీ లేయర్ కల్పించనున్నట్లు కశ్మీర్ పోలీస్ చీఫ్ వికే. బిర్డి తెలిపారు. ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు జమ్మూ-కశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సారి యాత్రను సురక్షితంగా సజావుగా చేయడానికి బహుళ అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామని కశ్మీర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అనంత్‌నాగ్ లో విలేకరులతో చెప్పారు.
38 రోజుల పాటు యాత్ర
నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి పహల్గాం వరకు ఉండే ప్రాంతాన్ని కశ్మీర్ పోలీస్ చీఫ్ బిర్డి సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. 38 రోజుల తీర్థయాత్రకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను జోనల్‌తో సహా వివిధ స్థాయిలుగా విభజించామని యాత్రకు ముందు బుధవారం భద్రతా కసరత్తులు జరిగాయని ఐజీపీ తెలిపారు. ఏదైనా అత్యవసర సమయంలో అప్రమత్తత, సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. యాత్ర మార్గాల్లోని శిబిరాలు, రోడ్లు అంతర్గత విభాగాలు వంటి ప్రతి ప్రదేశంలో క్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు.
స్థానికుల మద్దతు కచ్చితంగా ఉంటుంది
భద్రతా దళాలు అప్రమత్తంగా ఉంటూనే ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సన్నద్దంగా ఉన్నట్లు తెలిపారు. యాత్రకు స్థానిక మద్దతు గురించి అడిగినప్పుడు, స్థానిక ప్రజల మద్దతు లేకుండా యాత్ర ఉండదన్నారు. స్థానికుల సహాయం, మద్దతు కారణంగా ఈ యాత్ర విజయవంతం అవుతుందన్నారు. ఈసారి కూడా యాత్రికులను స్వాగతించడానికి వారికి సాధ్యమైన సహాయం అందించడానికి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ఐజీపీ అన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్, అనంత్‌నాగ్ ఖాజిగుండ్, శ్రీనగర్‌లోని పంథా చౌక్, ఉత్తర కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని సుంబల్ లలో భద్రతా దళాలు డ్రిల్స్ నిర్వహించాయి.