Amaravati: ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి

Amaravati: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ శ్రీ చరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్ విజేతగా నిలిచినందుకు ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది.

బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్వయంగా శ్రీ చరణికి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కృషిని ప్రశంసిస్తూ, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని అన్నారు.

నగదు బహుమతితో పాటు విశాఖపట్నంలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. అలాగే ఆమె డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇప్పటికే జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 14 వికెట్లు తీసి తన సత్తా చాటింది. నవంబర్ 2న జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ చరణిని అభినందించి ఈ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *