Amaravati: అవినీతి తిమింగలాలకు AI తో చెక్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తిమింగలాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన వారికి మూడేళ్లలోనే శిక్ష పడేలా చేసి జైలుకు పంపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపరుల బినామీ ఆస్తులను గుర్తించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో 2025 వార్షిక నివేదికను విడుదల చేసిన అతుల్ సింగ్, ఏసీబీ కొత్త వ్యూహాలు మరియు లక్ష్యాలను వివరించారు. ఈ సమావేశంలో ఏసీబీ డైరెక్టర్ ఆర్. జయలక్ష్మితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కరుడుగట్టిన అవినీతిపరులపై నిఘా పెట్టామని, వారి బినామీల వివరాలను ఏఐ ద్వారా సేకరిస్తున్నామని తెలిపారు.

ఐజీఆర్ఎస్ వ్యవస్థ నుంచి బినామీ ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలను ఏఐ సహాయంతో పర్యవేక్షిస్తామని డీజీ చెప్పారు. ఈ ఏడాది అవినీతి తిమింగలాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, అవినీతికి పాల్పడిన వారిని తప్పించుకోనివ్వబోమని స్పష్టం చేశారు.

2025లో రాష్ట్రవ్యాప్తంగా 115 అవినీతి కేసులు నమోదు కాగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలోనే 19 ట్రాప్ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. గతేడాది శిక్షల రేటు 46 శాతమేనని అంగీకరించిన అతుల్ సింగ్, ఈ రేటును పెంచేందుకు కొత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోర్టుల్లో సాక్షులు మాట మార్చకుండా ఉండేందుకు ఇకపై వారి వాంగ్మూలాలను సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయిస్తామని చెప్పారు.

అవినీతి నిర్మూలనలో ప్రజల సహకారం అత్యంత కీలకమని డీజీ అన్నారు. పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 1064, వాట్సాప్ నెంబర్ 9440440057లను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రెవెన్యూతో పాటు మరో నాలుగు కీలక శాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *