Bus Accident

Bus Accident: అల్లూరి జిల్లా బస్సు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి.. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా

Bus Accident:  ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకొని అన్నవరం వెళ్తుండగా, ప్రైవేటు బస్సు చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రమాద స్థలానికి మొబైల్ సిగ్నల్స్ లేకపోవడం వలన సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. మోతుగూడెం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాలను వెలికితీసి, క్షతగాత్రులను ఐదు పోలీస్ వాహనాలు, మూడు అంబులెన్సుల ద్వారా చింతూరు ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్యం అందుతోంది.

Also Read: Australia: ఆస్ట్రేలియాలో విమానం తోకలో చిక్కుకొన్న స్కైడైవర్ పారాచూట్‌: వీడియో వైరల్‌

ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధాని మోదీ, ఈ క్లిష్ట సమయంలో బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులు, వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రమాదంలోని బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు ఉన్నారు. భద్రాచలం నుంచి వెళ్లే బస్సు అదుపు తప్పి భద్రతా గోడను ఢీకొని లోయలో పడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలము మారుమూల ప్రాంతంలో ఉండటం వలన సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *