Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘ధురంధర్ 2: ది రివెంజ్’. గతంలో వచ్చిన ‘ధురంధర్’ మొదటి భాగానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమా విడుదల కంటే ఒక రోజు ముందే వేసిన పెయిడ్ ప్రివ్యూ షోలకు జనం బ్రహ్మరథం పట్టారు. సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు.
ముఖ్యంగా మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ధురంధర్ 2’ సినిమా ఒక అదిరిపోయే బ్లాక్ బస్టర్ అని బన్నీ కొనియాడారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ నటన అద్భుతమని, ఆయన లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి మన దేశంలో ఉండటం గర్వకారణమని ప్రశంసించారు. అలాగే సీనియర్ నటుడు ఆర్. మాధవన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందని, దర్శకుడు ఆదిత్య ధర్ ఈ కథను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించారని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి భారతీయుడు గర్వపడేలా ఉందంటూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
మరోవైపు బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు రెండో భాగం అంతకు మించి వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం పెయిడ్ ప్రివ్యూల ద్వారానే ఈ సినిమా ఏకంగా రూ.44 కోట్లు వసూలు చేయడం విశేషం. రెగ్యులర్ రిలీజ్‌కు ముందే ఇంతటి భారీ వసూళ్లు రావడం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ సునామీ మొదలైనట్టే కనిపిస్తోంది. ఈ సినిమా ఇండియాలోనే దాదాపు రూ.1,300 కోట్లు వసూలు చేస్తుందని బాక్సాఫీస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
