Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ఏడాది సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
అంకురార్పణతో బ్రహ్మోత్సవాల ప్రారంభం
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం ఈరోజు సాయంత్రం జరగనుంది. ఇప్పటికే ధ్వజారోహణ కార్యక్రమానికి ఉపయోగించే దర్భ చాప, తాడు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజుల పండుగకు తిరుమల క్షేత్రం అత్యంత రమణీయంగా ముస్తాబైంది.
భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అనేక చర్యలు తీసుకుంది.
* దర్శనం: ఉదయం, రాత్రి జరిగే వాహన సేవలను దర్శించుకోవడానికి వీలుగా, మాడవీధుల్లోని భక్తులకు 45 నిమిషాల సమయంలో 35 వేల మంది భక్తులు మళ్ళీ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేసింది.
Also Read: Navratri Day 2: దసరా నవరాత్రులు.. నేడు గాయత్రీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం!
* ఎల్‌ఈడీ స్క్రీన్లు: మాడవీధుల బయట ఉన్న భక్తులు కూడా వాహన సేవలను వీక్షించడానికి 36 పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
* ప్రసాదాలు: భక్తులకు 8 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచడంతో పాటు, అన్నప్రసాద కేంద్రంలో 16 రకాల వంటకాలను పంపిణీ చేయనున్నారు.
* రవాణా: ప్రతి 4 నిమిషాలకు ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంచి, యాత్రికులను నిర్దేశిత ప్రాంతాలకు చేర్చనున్నారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 3 వేల సీసీ కెమెరాల నిఘా, 2 వేల మంది సెక్యూరిటీ, 4,700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా, 3,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారు.
ప్రత్యేక ఆకర్షణలు
* బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రూ.3.5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలతో అలంకరించారు.
* దేశంలోని 29 రాష్ట్రాల నుంచి 229 కళా బృందాలు వాహన సేవలతో పాటు వివిధ సమయాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.
* పారిశుద్ధ్య నిర్వహణను పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఈసారి బ్రహ్మోత్సవాల్లో వీఐపీ దర్శనాలను రద్దు చేసి, సామాన్య భక్తులకు ఎక్కువ సమయం కేటాయించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.