Akshay Kumar: బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ తన కుమార్తెకు జరిగిన సైబర్ క్రైమ్ ఘటనను బహిరంగంగా వెల్లడించారు. ముంబై రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ ఆడేటప్పుడు ఎదుర్కొన ఒక సంఘటన, తన కూతురు నితారా అనుభవించిన చేదు అనుభవాలను పంచుకున్నారు.
అక్షయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, 13 ఏళ్ల నితారా కొద్ది నెలల క్రితం ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతుండగా ఒక అపరిచితుడి నుంచి మొదట సాధారణ మెసేజ్ వచ్చింది. “నువ్వు ఆడా, మగా?” అని అడిగిన ఆ వ్యక్తికి నితారా తాను అమ్మాయి అని రిప్లై ఇచ్చింది. ఆ వెంటనే అతడు అసభ్యకరమైన మెసేజ్ పంపి, నగ్న చిత్రాలు అడిగాడు. వెంటనే భయపడిన నితారా ఫోన్ ఆఫ్ చేసి జరిగిన విషయాన్ని తన తల్లికి తెలిపిందని అక్షయ్ కుమార్ చెప్పారు.
Also Read: GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ జోరు.. తెలంగాణ బేజారు!
ఈ సంఘటన ద్వారా పిల్లలు ఎదుర్కొంటున్న సైబర్ మోసాల తీవ్రతను అక్షయ్ హెచ్చరించారు. చిన్నారులు ఆన్‌లైన్‌లో ఆడే గేమ్స్ ఎంతటి ముప్పు తెచ్చిపెడతాయో ఈ ఘటన సాక్ష్యమని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా ‘సైబర్ ఎడ్యుకేషన్’ అనే సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారని అక్షయ్ అన్నారు. బ్యాంకు ఖాతాల నుండి డబ్బు దోచుకోవడం, ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, చిన్నారులపై అసభ్యకర ప్రయత్నాలు చేయడం వంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయని చెప్పారు. అక్షయ్ కుమార్ తన కూతురి వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవడం ద్వారా తల్లిదండ్రులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సంఘటన సైబర్ అవగాహన పెంపొందించడానికి ఒక బలమైన ఉదాహరణగా నిలిచింది.