Ajith: తమిళనాడులోని కరూర్ జిల్లాలో నటుడు విజయ్ నిర్వహించిన రాజకీయ సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు అజిత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దారుణమైన విషాదానికి కేవలం ఒక వ్యక్తిని (విజయ్‌ను) బాధ్యుడిని చేయడం సరికాదని, సమాజంగా మనందరిదీ బాధ్యత అని ఆయన అభిప్రాయపడ్డారు.
తొక్కిసలాట దారుణం, ఆర్థిక సాయం
సెప్టెంబర్ 27న కరూర్ సమీపంలోని వేలుసామిపురంలో విజయ్ నిర్వహించిన ప్రజా సంబంధాల కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు సహా 41 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
నటుడు విజయ్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను స్వయంగా కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఆయన ఆర్థిక సాయం ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
అజిత్ కీలక వ్యాఖ్యలు: ‘జనాన్ని పోగేసే వ్యామోహం’
‘హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా(youtube Channel)’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ ఈ విషయంపై స్పందిస్తూ, ఈ ప్రమాదకరమైన ధోరణికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
“తమిళనాడులో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధాకరం. ఆ ఘటనకు కేవలం ఆ వ్యక్తి (విజయ్) మాత్రమే బాధ్యుడు కాదు. మనమందరం బాధ్యులమే. ఇందులో మీడియా పాత్ర కూడా ఉందని నేను భావిస్తున్నాను” అని అజిత్ స్పష్టం చేశారు.
“ఈ రోజుల్లో జనాన్ని సమీకరించి, గుంపును చూపించుకోవాలనే ఒక రకమైన వ్యామోహంలో మనం కూరుకుపోయాం. వీటన్నింటికీ ముగింపు పలకాలి. కరూర్ లాంటి రాజకీయ కార్యకలాపాలని పూర్తిగా నివారించాలి” అని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mass Jathara Review: మాస్ జాతర మూవీ రివ్యూ – రవితేజ మాస్ డోస్
“క్రికెట్ మ్యాచ్ చూడటానికి కూడా పెద్ద సంఖ్యలో జనం వెళ్తారు, కానీ అక్కడ ఇలాంటివి జరగవు కదా? కేవలం సినిమా థియేటర్లలో, సినీ ప్రముఖుల దగ్గరే ఎందుకు జరుగుతున్నాయి?” అని అజిత్ ఆవేదన వ్యక్తం చేశారు.
సంబరాల పేరుతో థియేటర్లలో టపాసులు కాల్చడం, స్క్రీన్లు చించేయడం వంటివి ఆగాలని, ఇండస్ట్రీ చుట్టూ ఇలాంటి విషాదాలు నెలకొనడం వలన ప్రపంచవ్యాప్తంగా సినీ పరిశ్రమకి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు.
అభిమానుల ప్రేమ అదుపులో ఉండాలని అజిత్ సూచించాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

