Fire Indication: ఢిల్లీ నుంచి ఇండోర్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా రాజధానిలోనే అత్యవసర ల్యాండింగ్ చేసింది. ఆదివారం ఉదయం AI2913 ఫ్లైట్‌లో కాక్‌పిట్ సిబ్బందికి కుడి ఇంజిన్‌లో మంటలు చెలరేగుతున్నట్లు సూచన అందడంతో పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ వైపు మళ్లించారు.
ఉదయం 6:15 గంటల సమయంలో విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. అప్పటికి విమానం 30 నిమిషాలకు పైగా గాల్లోనే తిరుగుతూ భద్రతా ప్రమాణాలు పాటించినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24.com తెలిపింది. ఈ విమానంలో 90 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: TTD: రూ.2.93 కోట్లు.. టీటీడీకి భారీ విరాళాలు
ఎయిర్ ఇండియా ప్రకటన ప్రకారం, పైలట్లు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి ఇంజిన్‌ను ఆపివేసి విమానాన్ని సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ప్రస్తుతం విమానాన్ని తనిఖీల కోసం నిలిపివేసి ప్రయాణికులను ఇండోర్‌కు పంపేందుకు ప్రత్యామ్నాయ విమానంలోకి బదిలీ చేస్తున్నారు.
“ప్రయాణికుల భద్రతే మా ప్రధాన ప్రాధాన్యత. ఈ ఘటనపై ఎయిర్ సేఫ్టీ రెగ్యులేటర్ DGCAకి సమాచారం అందించాం. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం,” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
గత కొద్ది నెలలుగా ఎయిర్ ఇండియా విమానాలకు సాంకేతిక సమస్యలు తలెత్తిన ఘటనలు నమోదవుతున్నాయి. అయితే, ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం సాంత్వనకరం.