Air India: దేశ రాజధాని నుంచి ముంబై బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ పూర్తిగా పడిపోవడంతో పైలట్లు అత్యవసరంగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. పైలట్ల చాకచక్యం వల్ల పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగింది?
సోమవారం తెల్లవారుజామున 3:20 గంటలకు AI887 నంబర్ గల బోయింగ్ 777-337 ER విమానం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముంబైకి ప్రయాణమైంది. అయితే, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుడివైపు ఇంజిన్‌లో ఆయిల్ ప్రెజర్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని పైలట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: Venkatesh: అర్జున్ ఎక్కడ..? వెంకటేష్ వారసుడి ఎంట్రీ పైనే అందరి చూపు..!
నిమిషాల వ్యవధిలోనే ఆయిల్ ప్రెజర్ సున్నా (Zero) కి పడిపోవడంతో పరిస్థితి విషమించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులను అప్రమత్తం చేశారు. వారి సూచనల మేరకు విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు.
ఎయిర్ ఇండియా వివరణ
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ కీలక వివరాలు వెల్లడించారు.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు తెలిపారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Pomegranate Peel: దానిమ్మ తొక్కతో చర్మ సౌందర్యం
ఈ సాంకేతిక లోపానికి గల కారణాలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సంస్థ పేర్కొంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే లోపం గుర్తించాం. ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం, అందుకే తక్షణమే ల్యాండింగ్ నిర్ణయం తీసుకున్నాం. – ఎయిర్ ఇండియా ప్రతినిధి.
భయాందోళనలో ప్రయాణికులు
విమానం ఒక్కసారిగా మలుపు తిరిగి వెనక్కి వెళ్తుండటంతో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. అయితే ఢిల్లీలో విమానం సేఫ్ ల్యాండింగ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
