Ahmedabad: అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజీపై ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 171 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ కూలిపోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మెడికోలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఈ విమానం మధ్యాహ్నం 1:38 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే మేఘాలను ఢీకొని కూలిపోయింది.
ఈ విమానంలో మొత్తం 254 మంది ఉన్నారు. వారిలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్, ఒక కెనడియన్, ఇద్దరు శిశువులతో సహా 13 మంది చిన్నారులు ఉన్నారు. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం.
ప్రమాద ఘటనతో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ తాత్కాలికంగా మూసివేయబడింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. బీఎస్ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు మూడు దళాలుగా ఏర్పడి 90 మందితో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. విమానం కూలిన ప్రదేశం చుట్టుపక్కల ఉన్న పలు భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. బాధితుల సహాయార్థం ఎయిర్‌ఇండియా హెల్ప్‌లైన్ నెంబర్ 1800 5691 444 అందుబాటులో ఉంది.
ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమీక్ష నిర్వహిస్తోంది.