High Court: దేశంలో వీధి కుక్కల దాడుల కారణంగా జరుగుతున్న ప్రమాదాలు, మరణాలపై కోర్టులు సీరియస్‌గా స్పందిస్తున్నాయి. తాజాగా, సుప్రీంకోర్టు ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని ఆదేశించిన తర్వాత, రాజస్థాన్ హైకోర్టు కూడా కఠిన ఆదేశాలు జారీ చేసింది.
సోమవారం జస్టిస్ కుల్దీప్ మాథుర్, జస్టిస్ రవి చిరానియాలతో కూడిన డివిజన్ బెంచ్, రాష్ట్రంలోని మున్సిపల్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నగర రోడ్లు, కాలనీలు, ప్రజా మార్గాల నుండి వీధి కుక్కలు మరియు ఇతర జంతువులను తక్షణమే తొలగించాలనీ, వాటికి శారీరక హాని కలగకుండా షెల్టర్ హోమ్స్ లేదా పశువుల చెరువులకు తరలించాలని తెలిపింది.
కోర్టు హెచ్చరిక ప్రకారం, ఈ తొలగింపు పనులను ఎవరైనా అడ్డుకుంటే, మున్సిపల్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేయొచ్చని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Telangana Rains: తెలంగాణలో 13 నుంచి 16 వరకు అతి భారీ వర్షాలు..
అదే విధంగా..
-
జోధ్‌పూర్ ఎయిమ్స్, జిల్లా కోర్టు ప్రాంగణాల నుంచి వెంటనే జంతువులను తొలగించాలని ఆదేశించింది.
-
జాతీయ, రాష్ట్ర రహదారులపై క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించి వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచించింది.
-
ప్రజలు విచ్చలవిడిగా ఉన్న జంతువులపై ఫిర్యాదులు చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రస్‌లు అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది.
-
ఎవరైనా జంతువులకు ఆహారం పెట్టాలనుకుంటే, అది రోడ్లపై కాకుండా షెల్టర్ హోమ్ లేదా గోశాలలో చేయాలని కోర్టు సూచించింది.
ఈ కేసును సెప్టెంబర్ 8న మళ్లీ విచారణకు పెట్టారు.
ఇక సుప్రీంకోర్టు ఢిల్లీలో వీధి కుక్కలను తొలగించాలనే తీర్పు ఇచ్చిన తర్వాత జంతు ప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇండియా గేట్ వద్ద నిరసనలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ కూడా ఈ తీర్పును తప్పుపట్టారు. ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై కూడా జంతు ప్రేమికుల ప్రతిస్పందన ఎలా ఉండబోతోందో చూడాలి.